contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తిమ్మాపూర్ మండలంలో చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – ఐదుగురు నిందితుల అరెస్ట్

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన ఆర్‌ఎంపి వైద్యుడిపై దాడి చేసి చైన్ స్నాచింగ్ చేసిన కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన కారు, బంగారు గొలుసు మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు.

గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన తమ్మనవేని కొమురయ్య (56) ఆర్‌ఎంపి వైద్యుడిగా పనిచేస్తున్నారు. నిందితుల్లో నలుగురు స్థానిక ప్రాంతానికి చెందిన వారు కాగా, మరొకరు పెద్దపల్లి జిల్లాకు చెందినవారు.

జల్సాలకు అలవాటు పడిన ఈ నిందితులు గతంలో అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారు డ్యామేజీకి సంబంధించి యజమానికి రూ.40,000 చెల్లించాల్సి వచ్చింది. ఆ డబ్బు సమకూర్చుకోవడానికి దొంగతనం చేయాలని పథకం రచించారు. ఒంటరిగా తిరిగే కొమురయ్య మెడలో ఉన్న బంగారు గొలుసును లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం మార్చి 11న కరీంనగర్‌లో స్విఫ్ట్ డిజైర్ కారును అద్దెకు తీసుకుని మాటు వేశారు.

మార్చి 11 రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో కొమురయ్య నేదునూర్ నుండి తన మోటార్ సైకిల్‌పై ఇంటికి వస్తుండగా, నిందితులు కారులో వెంబడించారు. నేదునూర్ శివారులోని మామిడి తోట వద్ద అతడిని అడ్డుకుని, కళ్లలో కారం చల్లి భయభ్రాంతులకు గురిచేశారు.

ఆ తరువాత ఆయన మెడలోని ఒక తులం బంగారు గొలుసు మరియు రూ.1,000 నగదు దోచుకుని పరారయ్యారు.

పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై సిపి ఆదేశాల మేరకు ఏసీపీ కరీంనగర్ రూరల్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో తిమ్మాపూర్ సి.ఐ సదన్ కుమార్ మరియు సిబ్బంది దర్యాప్తు చేపట్టారు.

మార్చి 13 ఉదయం 8 గంటలకు ఇందిరానగర్ క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన స్విఫ్ట్ డిజైర్ కారును ఆపి తనిఖీ చేయగా ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు. విచారణలో వారు ఈ చైన్ స్నాచింగ్‌తో పాటు కోహెడ మండలంలో కరెంటు మోటార్ దొంగతనం చేసినట్లు కూడా ఒప్పుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

  • నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు (TS08-EF-3389)

  • సుమారు రూ.1,00,000 విలువైన ఒక తులం బంగారు గొలుసు

  • 4 మొబైల్ ఫోన్లు

  • రూ.1,000 నగదు

ఈ కేసును చాకచక్యంగా ఛేదించినందుకు ఏసీపీ విజయ్ కుమార్, సి.ఐ సదన్ కుమార్, ఎల్.ఎం.డి కాలనీ ఎస్.ఐ అన్వర్, కానిస్టేబుళ్లు రాఘవ, ఆకాష్, అనిల్ కుమార్లను సిపి ప్రత్యేకంగా అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :