గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నూతన స్కూల్ యూనిఫాంలను విద్యార్థులకు పంపిణీ చేశారు. శుక్రవారం ఆయా పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, ఉపసర్పంచులు పాల్గొని విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు.
గన్నేరువరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు సర్పంచ్ రంగనవేని లచ్చినర్సు, ప్రధానోపాధ్యాయులు కే. రామయ్య, ఉపసర్పంచ్ రామంచ స్వామి నూతన యూనిఫాంలను పంపిణీ చేశారు.
అదేవిధంగా మండలంలోని గోపాల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ ఆకుల కవిత, ఉపసర్పంచ్ బరిగల శంకర్ విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు. గునుకుల కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, హెచ్ఎం నరేష్, కార్యదర్శి రాజేష్ విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకుంటూ ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారని అన్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోందని తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లిస్తూ పిల్లలను చదివించడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫాంలు వంటి సౌకర్యాలు అందుతున్నాయని వివరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ బడులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అజయ్ వర్మ పేర్కొన్నారు.








