గోదావరిఖని : సింగరేణి సంస్థలో ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘం పదవీకాలం ముగిసినందున వెంటనే నూతన కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది.
ఈ మేరకు శనివారం రామగుండం ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3 ప్రాజెక్టు మేనేజర్ సంపత్ కుమార్‌కు సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ 27న నిర్వహించిన కార్మిక సంఘాల ఎన్నికల ఆధారంగా 2024 సెప్టెంబర్ 9న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గుర్తింపు సంఘం యూనియన్ రెండేళ్ల పదవీకాలం 2026 సెప్టెంబర్ 8తో ముగిసిందని తెలిపారు.
పదవీకాలం ముగిసిన నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి నూతన కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడే వరకు కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంస్థలో నమోదైన అన్ని రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్లకు సమాన అవకాశాలు, ప్రాతినిధ్యం, సమాన హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
గతంలో 2023 జూన్ 13న హైదరాబాద్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) సమక్షంలో యాజమాన్యం సర్క్యులర్ ద్వారా తెలిపిన విధంగా, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు అన్ని యూనియన్లకు సమాన ప్రాధాన్యత కల్పించాలని ప్రవీణ్ కుమార్ కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాంప్రసాద్, వినేష్, సంపత్, శివకుమార్, శ్రీనివాస్, రాజేందర్, మల్లేష్, రాజశేఖర్, శ్యాం ప్రసాద్, సంతోష్‌తో పాటు పలువురు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.








