మెదక్ జిల్లా – తూప్రాన్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వేల కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ “చలో అసెంబ్లీ”కి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం ప్రభుత్వ పిరికి చర్యగా ఓయూ విద్యార్థి నాయకుడు భీమరి సాయి సమ్మేర్ మండిపడ్డారు.
కోట్లాది రూపాయల బకాయిల కారణంగా పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సులు పూర్తయ్యాక కూడా సర్టిఫికేట్లు ఇవ్వకుండా ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పేద విద్యార్థులను నాణ్యమైన విద్యకు దూరం చేయాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే విద్యార్థుల్లో నెలకొన్న వ్యతిరేకతను ఒక్కటి చేసి భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని భీమరి సాయి సమ్మేర్ హెచ్చరించారు.








