తిరుపతి జిల్లా, పాకాల : తిరుపతి జిల్లా పాకాల మండలంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 5.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సీఐ చిన్న గోవిందు తెలిపారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలు, చంద్రగిరి ఎస్డీపీఓ బేతపూడి ప్రసాద్ సూచనల మేరకు పాకాల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఈ నెల 28న విశ్వసనీయ సమాచారం మేరకు పాకాల ఎస్ఐ సి. తరుణ్ తన సిబ్బందితో కలిసి కుందేవారిపల్లి–సంకంపల్లి రోడ్ సమీపంలోని కొండగుట్ట ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న నలుగురు వ్యక్తులను వెంటాడి పట్టుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో పూజారి ముని (28), ముల్లతంటి రాకేష్ (26), సింగనమల్లి సునీల్ కుమార్ (32), అక్కనగారి వెంకటసాయి (21) ఉన్నారు.
వారి వద్ద నిర్వహించిన తనిఖీలలో 8 పెద్ద ప్యాకెట్లు, 11 చిన్న ప్యాకెట్లలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.50 వేలుగా పోలీసులు అంచనా వేశారు.
పోలీసుల విచారణలో ఈ నిందితులు తిరుపతిలోని జనార్ధన్ అనే వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, పాకాల మరియు తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. జనార్ధన్ విశాఖపట్నం నుంచి గంజాయిని తెచ్చి సరఫరా చేస్తున్నట్లు సీఐ చిన్న గోవిందు తెలిపారు.
ఈ ఘటనపై పాకాల అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచారు. పరారీలో ఉన్న జనార్ధన్ను ఏ-5గా గుర్తించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని రసాయన పరీక్షల కోసం పంపించారు.
పోలీసుల హెచ్చరిక:
గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా, విక్రయం, వినియోగం చట్టవిరుద్ధమని సీఐ చిన్న గోవిందు హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.








