పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంగళవారం ఉదయం వింత ఘటన చోటుచేసుకుంది. తమ ఇల్లు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎలకలపల్లి గేట్–లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులు మెరుగు లక్ష్మీ, మొగిలి అశోక్‌నగర్‌లోని వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసనకు దిగారు.
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్‌పై నుంచి ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ బ్లూకోట్ పోలీస్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వన్‌టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న సీఐ ఇంద్రసేన రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వృద్ధ దంపతులతో మాట్లాడారు. వారి సమస్యను అడిగి తెలుసుకుని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్‌పై నుంచి కిందకు దిగారు.
అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ కూడా ఘటనాస్థలానికి చేరుకుని వృద్ధ దంపతులతో మాట్లాడారు. వారి సమస్యను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వన్‌టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి తక్షణ స్పందన, టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ చొరవతో పరిస్థితి సద్దుమణిగింది. ఘటన నేపథ్యంలో పోలీసులు, మున్సిపల్ అధికారులు సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.








