తూర్పు ఇండోనేషియాలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 7.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూకంపం సముద్రంలో సంభవించడంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:48 గంటలకు మొలుక్కా సముద్రంలో టెర్నాటే ద్వీపానికి సమీపంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సముద్ర గర్భంలో సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు USGS గుర్తించింది. ఈ పరిణామంతో భూకంప కేంద్రానికి సుమారు 1,000 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలు ఎగిసిపడే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇండోనేషియాతో పాటు ఫిలిప్పీన్స్, మలేషియా తీర ప్రాంతాలపై కూడా సునామీ ప్రభావం ఉండే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీంతో సంబంధిత దేశాల అధికారులు అప్రమత్తమయ్యారు.
భూకంప ప్రభావంతో నార్త్ సులవేసి ప్రావిన్స్‌లోని మనాడో నగరంలో ప్రజలు తీవ్ర భయానికి గురయ్యారు. భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా లేచి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమీపంలోని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు కూడా భయంతో బయటకు వచ్చారు.
“కొంతసేపు భూమి బలంగా కంపించింది. అందరం భయంతో బయటకు పరుగులు తీశాం. అయితే ప్రాథమికంగా పెద్దగా నష్టం కనిపించలేదు,” అని స్థానిక మీడియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే తక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.








