చేగుంట మండల కేంద్రంలోని వడియారం గ్రామంలో గురువారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని రాష్ట్ర గీతంతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని సర్పంచ్ ఎ. సాయి కుమార్ గ్రామ సభలో వినిపించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా గ్రామ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించారు.
గ్రామ ప్రజల సమస్యలు, అవసరాలపై చర్చిస్తూ అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిణి హేమ భార్గవి, సర్పంచ్ సాయి కుమార్, మెడికల్ ఆఫీసర్ అనిల్ కుమార్ రెడ్డి, ఉపసర్పంచ్ బండారి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి, ఇన్‌చార్జి ఎం.పి.ఓ విజయపాల్, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.








