కరీంనగర్ జిల్లాలో ట్రాఫిక్ నియమాల అమలుపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు పట్టణవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్సెల్ వాహనాలు నడుపుతున్న వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ తనిఖీలను ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు.
తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేకుండా నడుస్తున్న 140 వాహనాలను పోలీసులు తాత్కాలికంగా నిర్బంధించారు. అనంతరం మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. ఈ చర్యల అనంతరం వాహనదారులకు పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి మాట్లాడుతూ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణంలో రహదారి భద్రతను పెంపొందించేందుకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.








