అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బస్టాండ్‌లో ఇటీవల జరుగుతున్న నేరాలు, చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అర్బన్ సీఐ రామారావు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బస్టాండ్ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బస్సుల్లో ప్రయాణికులతో పాటు అనుమానాస్పదంగా వ్యవహరించే వ్యక్తులు, గమ్యం చేరకముందే వివిధ కారణాలతో బస్సు ఎక్కి దిగే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
అలాంటి అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేయడం సులభమవుతుందని తెలిపారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు.
సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని సీఐ రామారావు స్పష్టం చేశారు








