జగిత్యాల : ప్రజలకు ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేరవేయడంలో మీడియా కీలకమైన వారధిగా పనిచేస్తుందని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో 2026–28 సంవత్సరాలకు సంబంధించిన నూతన అక్రిడిటేషన్ కార్డులను జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా నాలుగో స్థంభమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వాస్తవాలను సమగ్రంగా ప్రజలకు అందించే వార్తలు, విశ్లేషణలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. అక్రిడిటేషన్ కార్డులు జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన, వాస్తవాధారిత వార్తలతో ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని జర్నలిస్టులకు సూచించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా వారధిగా నిలుస్తోందన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు వేగంగా, పారదర్శకంగా చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజలకు నమ్మకమైన సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా పౌర సంబంధాల అధికారి వి. శ్రీధర్, జిల్లాలోని పలువురు వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.








