శ్రీనగర్ : జులై 3 నుంచి ప్రారంభం కానున్న పవిత్ర అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో కేంద్ర, జమ్ముకశ్మీర్ భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో యాత్ర మార్గమంతా బహుళ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేపట్టి, యాత్రికుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్‌లో అలజడి సృష్టించే కుట్రలకు పాల్పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు పాల్గొనే అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
నిఘా సంస్థలు సేకరించిన సమాచారంలో జమ్ముకశ్మీర్‌లోని అడవుల్లో తలదాచుకున్న కొందరు ఉగ్రవాదులతో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద మద్దతుదారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడైంది. పెద్దఎత్తున దాడులకు పాల్పడేలా వారిని ప్రేరేపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో యాత్ర మార్గంలోని కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు, కేంద్ర భద్రతా దళాలను మోహరించారు. ఉగ్రవాద వ్యతిరేక నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా కెమెరాలు, డిజిటల్ స్కానింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రతి యాత్రికుడి కదలికను నిశితంగా పర్యవేక్షించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తూ అనుమానితుల కోసం జల్లెడ పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
యాత్రికుల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు స్పష్టం చేశారు. అదే సమయంలో భక్తులు అధికారిక సూచనలను తప్పనిసరిగా పాటించాలని, వదంతులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని భద్రతా వర్గాలు సూచించాయి. పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.








