contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హత్యకు గురైన కర్రె సునీత బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన బక్కి వెంకటయ్య

జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామంలో హత్యకు గురైన దళిత మహిళ కర్రె సునీత కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, దళితులపై హత్యలు, హత్యాయత్నాలు జరగడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అందరూ సమానమేనని, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే భావజాలాన్ని పూర్తిగా విడనాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి అమానుష ఘటనలను సమాజం మొత్తం ఖండించాలని పిలుపునిచ్చారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఆయన, హత్య కేసు దర్యాప్తు పురోగతిపై పోలీసు, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి జీవిత ఖైదు పడేలా సమర్థవంతంగా వ్యవహరించాలని అధికారులను కోరారు.

హత్యకు గురైన సునీతకు ఇద్దరు కుమారులు ఉన్నారని గుర్తు చేసిన బక్కి వెంకటయ్య, వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, ఆర్‌డీవో నరసింహరావు, డీఎస్పీ రాములు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీణ్, నీలాదేవి, రాంబాబు, శంకర్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్, తహసీల్దార్ నీతా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :