పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ రాయితీతో కూడిన విద్యా సౌకర్యాలు కల్పించాలని టీయూడబ్ల్యూజే హెచ్-143 జాతీయ కౌన్సిల్ సభ్యులు, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు అంకరి ప్రకాష్, టీయూడబ్ల్యూజే హెచ్-143 జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు.
సోమవారం టీయూడబ్ల్యూజే హెచ్-143 ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో సుమారు 500 మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు, మరో 200 మంది నాన్-అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారని తెలిపారు. వీరి పిల్లలందరికీ ప్రైవేటు విద్యాసంస్థల్లో రాయితీపై విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో జర్నలిస్టుల కుటుంబాల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి పూర్తిగా ఉచిత విద్య, మరొకరికి 50 శాతం రాయితీతో విద్య అందించేవారని గుర్తు చేశారు. ఈ ఏడాది జర్నలిస్టుల ఇద్దరు పిల్లలకు కూడా పూర్తిస్థాయి ఉచిత విద్య అందించే అవకాశాన్ని పరిశీలించాలని కలెక్టర్‌ను కోరారు.
జర్నలిస్టుల వినతిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సానుకూలంగా స్వీకరించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి జర్నలిస్టుల పిల్లలకు రాయితీ విద్య అందించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష జర్నలిస్టుల అక్రిడేషన్ ప్రక్రియతో పాటు వారి సమస్యల పరిష్కారంలో కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. ఇప్పటికే రెండు విడతలుగా సుమారు 450 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందజేశారని, మిగిలిన అర్హులైన జర్నలిస్టులకు కూడా త్వరలో అక్రిడేషన్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు తిర్రి తిరుపతి గౌడ్, కత్తెర్ల తిరుపతి యాదవ్, అర్కుట మల్లేష్ యాదవ్, కొయ్యడ తిరుపతి యాదవ్, మేకల సంతోష్, చేగొండ రవికుమార్ యాదవ్, మాచర్ల వంశీ, తిర్రి సుధాకర్ గౌడ్, సుంకే రాజు, నల్లపు తిరుపతి, మార్పాక అంజి, తూర్పాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







