అనంతపురం జిల్లా, గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చారిత్రాత్మక గుత్తి కోటలో వెలసిన పురాతన, మహిమాన్వితమైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి గంటా నరహరి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గంటా నరహరి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుభిక్షం కలగాలని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు.
వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహించి, 101 బిందెలతో అమ్మవారి పాదాలకు జలాభిషేకం, గంగాపూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించగా, ఆలయ ప్రాంగణంలో భక్తి గీతాలు, భజన కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. రాత్రి వరకు కొనసాగిన వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.







