జగిత్యాల : ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిశీలించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 24 మంది అర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఓర్పుగా విన్నారు. ప్రతి ఫిర్యాదుకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు చట్టబద్ధంగా, పారదర్శకంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి, చట్ట పరిధిలో పరిష్కరించగల సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విచారణ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ ఎలాంటి లోపాలకు తావు లేకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా పోలీసు శాఖ ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్భయంగా పోలీసు శాఖను ఆశ్రయించాలని, ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా విచారించి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు.







