contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు : సీపీ గౌష్ ఆలం

కరీంనగర్: డ్రంకెన్ డ్రైవ్ కేసుల పరిష్కారంలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ముగ్గురు పోలీసు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన అంతర్గత విచారణలో అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆర్ఎస్సై శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ కె. సాయి కృష్ణ, డీడీ డిస్పోజల్ స్టేషన్ కానిస్టేబుల్ ఎన్. కిరణ్‌లను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

కరీంనగర్ పద్మనగర్‌కు చెందిన బేతి రాజేందర్ (50) అనే వ్యక్తి మే 19న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఆర్ఎస్సై శ్రీకాంత్‌కు పట్టుబడ్డాడు. అయితే నిందితుడు కోర్టుకు హాజరుకాకుండానే కేసు డిస్పోజ్ అయినట్లు విచారణలో గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి డీఐజీకి నివేదిక సమర్పించగా, విచారణ ఆధారంగా చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు.

విచారణలో నిందితుడి నుంచి రూ.15 వేల లంచం తీసుకుని, ఆర్ఎస్సై శనిగల శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ కె. సాయి కృష్ణ, డీడీ డిస్పోజల్ స్టేషన్ కానిస్టేబుల్ ఎన్. కిరణ్ కలిసి డూప్లికేట్ ఎస్టీసీ (Summary Trial Case) నంబర్‌ను పోలీస్ సైట్‌లో నమోదు చేసి కేసును అక్రమంగా ముగించినట్లు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.

డ్రంకెన్ డ్రైవ్ కేసులపై విస్తృత విచారణ

2025 జనవరి నుంచి 2026 జూన్ 30 వరకు నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో చేపట్టిన విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.

విచారణలో మొత్తం 113 కేసుల్లో డూప్లికేట్ లేదా రిపీటెడ్ ఎస్టీసీ నంబర్లు గుర్తించినట్లు తెలిపారు. వీటిలో 13 కేసుల్లో అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారని పేర్కొన్నారు.

  • 3 కేసుల్లో: నిందితులు కోర్టుకు హాజరుకాకుండానే ఒక్కొక్కరికి రూ.6,000, రూ.3,000, రూ.1,000 జరిమానా చెల్లించినట్లు చూపించి కేసులను తప్పుగా డిస్పోజ్ చేసినట్లు తేలింది.
  • 10 కేసుల్లో: కోర్టు విధించిన జరిమానా కంటే అదనంగా మొత్తం రూ.9,700 నిందితుల నుంచి లంచంగా వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

మిగిలిన 100 కేసుల్లో నిందితులు కోర్టుకు హాజరై జరిమానా చెల్లించినప్పటికీ, కోర్టు రికార్డుల్లో పలు కేసులకు డూప్లికేట్ లేదా రిపీటెడ్ ఎస్టీసీ నంబర్లు కేటాయించినట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు.

ఇప్పటివరకు జరిగిన విచారణలో 14 కేసుల్లో రూ.34,700 మేర అవినీతి జరిగినట్లు తేలిందని సీపీ వెల్లడించారు. అయితే కొన్ని మీడియా కథనాల్లో ప్రచారం జరుగుతున్నట్లు రూ.30 లక్షల అవినీతి జరిగినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు.

వాహనదారులకు సీపీ సూచనలు

డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారు సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టుకు హాజరు కావాలని, కోర్టు విధించే జరిమానాను నేరుగా కోర్టు సిబ్బందికే చెల్లించి రశీదు పొందాలని సీపీ సూచించారు.

ఎవరైనా పోలీసులు అదనపు డబ్బులు డిమాండ్ చేసినా, లేదా డబ్బులు తీసుకుని కోర్టుకు హాజరు పరచకుండా డ్రంకెన్ డ్రైవ్ కేసులను ముగిస్తామని చెప్పినా వెంటనే కరీంనగర్ సీపీ కార్యాలయం లేదా ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :