contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

హైదరాబాద్ : ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన ఆయనను బుధవారం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం న్యాయమూర్తి ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయనను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో తనతో పాటు శిక్షణ పొందుతున్న 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, పలుమార్లు లైంగికంగా వేధించడం, వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపడం, వెంటపడటం (స్టాకింగ్), అక్రమంగా నిర్బంధించడం, శారీరకంగా దాడి చేసి బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఆమెకు తెలియకుండా ప్రైవేట్ వీడియోను చిత్రీకరించి, దానిని ఆమె భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేసినట్లు కూడా ఫిర్యాదులో ఆరోపించారు. ఈ నెల 18న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)తో పాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళ పట్ల నేరపూరిత బలప్రయోగం, లైంగిక వేధింపులు, గోప్యతకు భంగం కలిగించడం, అశ్లీల సమాచారాన్ని ప్రసారం చేయడం తదితర అభియోగాలు నమోదు చేశారు.

అరెస్టు అనంతరం దర్యాప్తు భాగంగా పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అశోక్‌నగర్‌లోని ఆయన నివాసానికి తీసుకెళ్లి ఘటనకు సంబంధించిన సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించినట్లు సమాచారం.

మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా ఖండించారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బాధితురాలితో 2025 జూన్ నుంచి పరస్పర అంగీకారంతో సంబంధం కొనసాగిందని, ఆమె వివాహం అనంతరం కూడా ఆ సంబంధం కొనసాగిందని ఆయన వాదించారు. తమ వాదనకు మద్దతుగా ఫొటోలు, వీడియోలు సహా ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

ఇటీవల మోతీనగర్‌లోని బంధువుల ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన ఉదయ్‌ను ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆత్మహత్యాయత్నం జరిగిందనే ప్రచారం జరిగినప్పటికీ, సానుభూతి పొందేందుకు ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన అదృశ్యమయ్యారనే వార్తలు వెలువడగా, తన అనారోగ్యంతో ఉన్న నాయనమ్మను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఉళ్లపాలెం వెళ్లానని, తాను పరారీలో లేనని ఉదయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, బాధితురాలికి ఇంకా నోటీసులు జారీ చేయలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో, హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపగా, దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. కేసులో సేకరిస్తున్న సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :