గోదావరిఖని : సింగరేణి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్ష మూడో రోజుకు చేరుకుంది. దీక్షలో భాగంగా బాధితులు నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
బాధితుల ఆందోళనకు శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. పార్టీ నాయకులు కౌశిక్ హరి, పర్లపల్లి రవి, జేవీ రాజు, కార్పొరేటర్ కర్క శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ నిమ్మ రాజుల రవి, కల్వల సాగర్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి బాధితులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కౌశిక్ హరి మాట్లాడుతూ.. సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారమయ్యే వరకు బాధితుల తరఫున పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
లక్కా శ్రావణ్ గౌడ్ అధ్యక్షతన ఈ నిరసన దీక్ష శాంతియుతంగా కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు, నాయకులు స్పష్టం చేశారు.
మూడో రోజు నిరసన కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, షేక్ బాబర్, పిట్టల అనిల్, గుర్రం సుధాకర్, కొమురమ్మ, అంబటి రాజశేఖర్, శ్రీనివాస్, లక్కా శ్రావణ్, హరీష్, డిష్ బాబు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.








