గోదావరిఖని : రామగిరి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాపూర్ గ్రామంలో ఆదివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రామగిరి ఎస్‌ఐ తాడవేన శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పోలీసులు గ్రామంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులకు నేరాల నియంత్రణ, అపరిచిత వ్యక్తుల కదలికలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు ఎలాంటి కారణం లేకుండా ఆశ్రయం కల్పించవద్దని పోలీసులు హెచ్చరించారు.
అనంతరం గ్రామంలో వాహనాలను తనిఖీ చేయగా, నంబర్ ప్లేట్‌లు లేని, సరైన ధ్రువపత్రాలు లేని 9 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.
అదేవిధంగా సైబర్ క్రైమ్, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ప్రాధాన్యత, ట్రాఫిక్ నిబంధనలు, నూతన చట్టాలపై గ్రామస్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రామగిరి ఎస్‌ఐ తాడవేన శ్రీనివాస్, ముత్తారం ఎస్‌ఐ రవికుమార్, సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య, ఉప సర్పంచ్ కలవేన శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.








