contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చెన్నారెడ్డి హత్యను రాజకీయంగా వాడుకోవద్దు

గుంటూరు: రెండు రోజుల క్రితం జరిగిన తమ పార్టీ యువ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్య ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని పిన్నెల్లి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో తమ తమ్ముడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డికి సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయడం తీవ్రంగా బాధ కలిగించిందని పేర్కొంది.

ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పిన్నెల్లి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ కుటుంబం గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతోందని తెలిపారు. తమ వెంట నడిచే నాయకులు, కార్యకర్తలను ఎప్పుడూ కుటుంబ సభ్యుల్లాగే భావిస్తామని, వారి కష్టసుఖాల్లో అండగా నిలవడం తమ కుటుంబానికి రాజకీయాల కంటే ముందున్న బాధ్యత అని పేర్కొన్నారు.

తమ కోసం నిలబడిన కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతామని, అవసరమైతే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వారిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. తమను నమ్ముకుని నడిచే నాయకులు, కార్యకర్తల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.

అలాంటి తమ కుటుంబంపై, ముఖ్యంగా పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాధాకరమని వారు అన్నారు. ఇటీవల ఓ పత్రిక, మీడియాలో చెన్నారెడ్డి హత్య ఘటనకు సంబంధించి వెంకట రామిరెడ్డి పేరును ప్రస్తావించడం తమను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.

ఒక యువ నాయకుడి హత్య వంటి విషాదకరమైన ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పిన్నెల్లి కుటుంబం పేర్కొంది. వాస్తవాలను నిర్ధారించకుండా వ్యక్తులపై ఆరోపణలు చేయడం వల్ల వారి ప్రతిష్ఠకు భంగం కలగడంతో పాటు, బాధిత కుటుంబం విషాదంలో మరింత రాజకీయ వివాదం ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

హత్య ఘటనపై దర్యాప్తు సంస్థలు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ఆధారాల ఆధారంగానే దోషులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిన్నెల్లి కుటుంబం కోరింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :