రెంటచింతల, పల్నాడు జిల్లా: రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నవులూరి భాస్కర్ రెడ్డి కుమారుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ నవులూరి చెన్నారెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం రెంటాల గ్రామంలో నిర్వహించిన ఆయన చిన్నకర్మ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరై చెన్నారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు యొనుముల మురళీధర్ రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కె.వి.), వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చెన్నారెడ్డి మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించిన ఆయన సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, చెన్నారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
చిన్నకర్మ కార్యక్రమానికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై చెన్నారెడ్డికి నివాళులు అర్పించారు.








