పల్నాడు జిల్లా: ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన పెండింగ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, అర్హులైన ఎస్సీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ డిమాండ్ చేశారు.
నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం కారణంగా ఎస్సీ యువత, పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు రుణాలు పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ సబ్సిడీ నిధులు అందక అనేక మంది స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించలేకపోతున్నారని తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించి, గతంలో పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను తక్షణమే మంజూరు చేయాలని కోట సుబ్బు మాదిగ కోరారు. అలాగే నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి కొత్త స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి స్వయం ఉపాధి పథకాలు ఎంతో కీలకమని, ప్రభుత్వం ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిధుల విడుదలపై ప్రభుత్వం ఇకనైనా స్పందించకపోతే ఎస్సీ యువత, లబ్ధిదారులను సమీకరించి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు జమ్మలమూడి విజయ మాదిగ, యువసేన నాయకులు పాలెపోగు వరుణ్, మండల అధ్యక్షులు తిమోతి, గ్రామ నాయకులు లాజర్, పచ్చిగోళ్ళ సుధాకర్, మన్నవ సురేష్, దావల చంటి తదితరులు పాల్గొన్నారు.








