గోదావరిఖని : రామగుండం ఎన్టీపీసీ టౌన్లో నెలకొన్న అభివృద్ధి సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు ఈదునూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మార్గదర్శకత్వంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్టీపీసీ టౌన్ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు.
అన్నపూర్ణ కాలనీలో ఏడాదిగా సమస్యలే..
అన్నపూర్ణ కాలనీలో ఇళ్ల తొలగింపు ప్రక్రియ పూర్తయి ఏడాది గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమని ఈదునూరి శ్రీకాంత్ విమర్శించారు. కాలనీ ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
సర్వీస్ రోడ్డు లేక వాహనదారులకు ఇక్కట్లు
ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ ఎక్స్ రోడ్‌లోని ఎస్బీఐ నుంచి మేడిపల్లి సెంటర్ వరకు సరైన సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ప్రజలు రాంగ్ రూట్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. దీనివల్ల వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయని, ఒక్కో వాహనదారుడిపై సుమారు రూ.1,200 వరకు జరిమానా భారం పడుతోందని పేర్కొన్నారు.
కార్మికుల ఫిట్నెస్ పరీక్షలపై ఆరోపణలు
ఎన్టీపీసీలో పనిచేస్తున్న కార్మికులను సరైన కారణాలు లేకుండానే ‘అన్‌ఫిట్’గా ప్రకటించి ఇతర ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. దీంతో కార్మికులు ఒక్కోసారి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు.
ఎన్టీపీసీ టౌన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలని ఈదునూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల తరఫున బీఆర్ఎస్ మరింతగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఈదునూరి పర్వతాలు, వీర్ లాల్, ఈదునూరి అశోక్‌తో పాటు పలువురు ఎన్టీపీసీ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.








