గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను విడనాడాలని, కార్మికులు, రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో కార్మిక, రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) పిలుపు మేరకు చేపట్టిన “జైల్ భరో” కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద సోమవారం సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, తుమ్మల రాజారెడ్డి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు ఈ. నరేష్, రైతు సంఘం నాయకులు గుమ్మడి వెంకన్న, ఎం. మల్లయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా, కార్మికులు, రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు.
ఎందరో పోరాట యోధుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని విదేశీ సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టే విధానాలను కేంద్రం అనుసరిస్తోందని ఆరోపించారు. నాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నేడు కార్పొరేట్ పెట్టుబడిదారులు, మతోన్మాద శక్తుల విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని నాయకులు డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని, ప్రజల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాస్తారోకో కారణంగా మున్సిపల్ టీ జంక్షన్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో కార్మిక, రైతు సంఘాల నాయకులు టి. రాజిరెడ్డి, చిలుక శంకర్, వేల్పుల కుమారస్వామి, కుంట ప్రవీణ్‌కుమార్, జూపాక శ్రీనివాస్, ఎం. దుర్గయ్య, రామాచారి, జి. రాజన్న, లక్ష్మారెడ్డి, ఎస్. రాజేశ్వర్, రావు, బిక్షపతి, ఎస్. ప్రసాద్, కే. ధర్మేందర్, పోగుల శేఖర్, శోభన్‌బాబు, రాజేశం, శేఖర్, బత్తుల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.








