అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం: కొండ శిఖర గ్రామంలో నివసిస్తున్న పీవీటీజీ కొందు ఆదివాసీ కుటుంబాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని కొండ శిఖర గ్రామమైన పిత్రిగడ్డలో 26 కొందు ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి.
గ్రామానికి గ్రావిటీ స్కీం ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించేందుకు జిల్లా పరిషత్ నిధుల నుంచి గత మే నెలలో రూ.7.50 లక్షలు మంజూరయ్యాయని గ్రామస్తులు తెలిపారు. నిధులు మంజూరైన విషయం తెలిసి సంతోషించినప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంతో తమ సమస్యలు మరింత తీవ్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం గ్రామంలోని కుళాయిలకు బురద నీరు వస్తోందని, అదే నీటిని తాగడం వల్ల అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామ మహిళలు తెలిపారు. మరోవైపు గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో నిత్యావసరాల కోసం, ముఖ్యంగా తాగునీటి కోసం డోకులు మోసుకుంటూ కొండ దిగాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు.

తక్షణమే తాగునీటి పథకం పనులు ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పనులు వెంటనే చేపట్టకపోతే ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహిస్తామని గ్రామ మహిళలు హెచ్చరించారు.
ఈ సందర్భంగా కే. గోవిందరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు, మాట్లాడుతూ పిత్రిగడ్డ గ్రామంలో తాగునీటి సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాలని కోరారు. పీవీటీజీ సంఘం అధ్యక్షుడు కొండతాంబలే వెంకట్రావు మాట్లాడుతూ నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ఎంపీడీవో కార్యాలయం వద్ద బిందెలతో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వంతుల రాధమ్మ, గేమిల మణికుమారి, వంతల రాధా తదితర గ్రామ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.









