contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యూరియా యాప్‌ రద్దు చేయాలని రైతుల ధర్నా

చేగుంట–తూప్రాన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి, పాస్‌బుక్ ఆధారంగా రైతులకు నేరుగా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ పొలం పల్లి గ్రామ రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వరి నాట్లు వేసి నెలలు గడుస్తున్నా అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో పంట ఎదుగుదల మందగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునేలోపే నిమిషాల్లో స్టాక్ అయిపోతుండటంతో చాలామంది రైతులకు ఎరువులు దొరకడం లేదని ఆరోపించారు.

వరి పంటకు బదులుగా మొక్కజొన్న, పత్తి, కూరగాయల సాగు చేపట్టాలని ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఆయా పంటలకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమయ్యాయని రైతులు విమర్శించారు.

యూరియా విక్రయ కేంద్రాల్లో తగినంత ఎరువులను అందుబాటులో ఉంచాలని, యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాస్‌బుక్ ఆధారంగా రైతులకు యూరియా పంపిణీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. దీంతో మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :