చేగుంట–తూప్రాన్ : మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో హుండీ చోరీ కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి ముసుగు ధరించిన గుర్తుతెలియని వ్యక్తి ఆలయ తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
బుధవారం ఉదయం ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ముసుగు ధరించిన వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి హుండీని తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డైనట్లు గుర్తించారు.
చోరీకి పాల్పడిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? హుండీలో ఎంత నగదు ఉంది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆలయంలో చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం వద్ద భద్రతా చర్యలు, రాత్రివేళ పోలీసుల పెట్రోలింగ్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలయాలు, ప్రధాన ప్రార్థనా స్థలాల వద్ద రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు.








