గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదనగర్ పీజీ కళాశాల ఆవరణలో బుధవారం ఉదయం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ర్యాలీలో వాకర్స్, మాజీ సైనికులు, ఉద్యోగులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ నిర్వహించిన ర్యాలీ ఉత్సాహంగా సాగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశభక్తిని, జాతీయ ఐక్యతను చాటాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.
అనంతరం పీజీ కళాశాల ఆవరణలో మాజీ సైనికులను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆత్మీయంగా సత్కరించారు. దేశ రక్షణ కోసం సేవలందించిన మాజీ సైనికుల సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలతో కళాశాల ఆవరణ దేశభక్తి నినాదాలతో మార్మోగింది.








