contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కనిగిరిలో ‘దర్శి చెంచయ్య రోడ్డు’ గా నామకరణం

కనిగిరి: స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల సేవలను భావితరాలు స్మరించుకునేలా కనిగిరిలో ఓ రహదారికి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కనిగిరి ముద్దుబిడ్డ దివంగత దర్శి చెంచయ్య పేరు పెట్టారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ‘మహాలక్ష్మమ్మ చెట్టు వీధి’ని ఇకపై ‘దర్శి చెంచయ్య రోడ్డు’ గా నామకరణం చేశారు.

శనివారం అమన్ టీ స్టాల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై. రవీంద్రబాబు మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కనిగిరి పట్టణంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. దర్శి చెంచయ్య పేరును రహదారికి పెట్టడం ద్వారా ఆయన సేవలు, త్యాగాలను చిరస్థాయిగా గుర్తుంచుకునే అవకాశం ఏర్పడిందని అన్నారు.

ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడి పేరును రహదారికి పెట్టడం కేవలం నామకరణం మాత్రమే కాదని అన్నారు. అది ఆయన చేసిన త్యాగాలకు అందిస్తున్న గౌరవమని, భావితరాలకు అందిస్తున్న స్ఫూర్తి అని పేర్కొన్నారు.

కనిగిరి గడ్డకు దర్శి చెంచయ్య అందించిన సేవలకు ఈ నామకరణం ఘన నివాళి అని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన దేశభక్తి, ధైర్యం, త్యాగం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల సేవలను నేటి తరం తెలుసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మహనీయుల పేర్లు చరిత్రలో నిలిచిపోయేలా చేయడంతో పాటు వారి సేవలను భావితరాలు స్ఫూర్తిగా తీసుకునేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు దేవకి వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ యాసిన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, ఆర్యవైశ్య ప్రముఖులు, బీజేపీ నాయకులు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :