contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హెచ్‌-1బీ వీసాకు రూ.86 లక్షల అదనపు భారం! .. భారతీయులకు ట్రంప్‌ షాక్‌..

వాషింగ్టన్: అమెరికాలో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు ఇకపై భారీ ఆర్థిక భారం తప్పేలా కనిపించడం లేదు. హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం 1,03,265 అమెరికన్‌ డాలర్ల అదనపు రుసుము విధించే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రస్తుత మారకం విలువ ప్రకారం ఈ మొత్తం సుమారు రూ.86 లక్షలు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేయాలనుకునే భారతీయ ఐటీ నిపుణులు, వారిని నియమించుకునే కంపెనీలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రతి ఏడాది జారీ చేసే 85 వేల హెచ్‌-1బీ వీసాలకు ఈ అదనపు రుసుము వర్తించేలా ప్రతిపాదించారు. ఇందులో అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి మాస్టర్స్‌ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హతలు పొందిన వారికి కేటాయించే 20 వేల వీసాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉన్న సాధారణ వీసా రుసుములకు అదనంగా ఈ భారీ మొత్తాన్ని సంబంధిత సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ ప్రతిపాదన ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రతిపాదన ప్రచురించిన అనంతరం 30 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. అనంతరం వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ అదనపు రుసుము ద్వారా ఏటా సుమారు 8.8 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అంచనా వేసింది. వలస దరఖాస్తుల పరిశీలన, మోసాల గుర్తింపు, జాతీయ భద్రతా తనిఖీలు, ప్రభుత్వ వ్యవస్థల ఆధునికీకరణ వంటి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే వలస న్యాయస్థానాలు, కాన్సులర్‌ సేవలు, కార్మిక ప్రమాణాల అమలుకు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది.

మరోవైపు, ఈ ప్రతిపాదనపై అమెరికా వ్యాపార వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు ఇంత భారీ రుసుము చెల్లించడం కష్టంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడంపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.

ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్‌ అధ్యక్షుడు టాడ్‌ షుల్టే ఈ ప్రతిపాదనను అమెరికా వ్యాపార సంస్థలపై పడే భారీ పన్నుగా అభివర్ణించారు. కంపెనీల నిర్వహణ వ్యయాలు పెరగడంతో పాటు, అవసరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

హెచ్‌-1బీ వీసాల ద్వారా అమెరికాలోని టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, ఆరోగ్య, ఆర్థిక తదితర రంగాల్లో పెద్ద సంఖ్యలో విదేశీ నిపుణులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణుల సంఖ్య గణనీయంగా ఉండటంతో, ప్రతిపాదిత రుసుము తుది రూపంలో అమల్లోకి వస్తే భారతీయ ఉద్యోగులు, అమెరికన్‌ కంపెనీలపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :