గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : చౌకదుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు.
మంగళవారం గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్‌లో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరింత పారదర్శకంగా, సులభంగా సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు. రేషన్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈకార్యక్రమంలో గన్నేరువరం తాసిల్దార్ ఇప్ప నరేందర్, ఇన్చార్జి ఎంపీడీవో సురేందర్, స్థానిక సర్పంచ్ లచ్చినర్సు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రఘు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునిల్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కు ఉపేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కటుకం తిరుపతి, ఖాసీంపేట సర్పంచ్ కర్నె చంద్రయ్య, పార్టీ నాయకులు అలువాల కోటి, కొమ్మెర రవీందర్ రెడ్డి, మాతంగి అనిల్, చింతల శ్రీధర్ రెడ్డి,తిప్పర్తి పరిపూర్ణచారి,జెల్ల రాజేశ్వరి, శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, అంజిరెడ్డి తోపాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షలు తదితరులు పాల్గొన్నారు.








