మెదక్ జిల్లా శంకరంపేట ఆర్ మండల కేంద్రంలో మాల శ్రీ రేణుక సమేత పోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న శ్రీ రేణుక సమేత పోచమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మ దేవేందర్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు పద్మ దేవేందర్ రెడ్డిని వారి నివాసంలో కలిసి మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వైభవోపేత ధార్మిక మహోత్సవానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ఆమెను కోరారు. ఆలయ అభివృద్ధి, గ్రామ ప్రజల ఆధ్యాత్మిక ఐక్యతకు ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ప్రత్యేక సందర్భంగా నిలవనుందని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట మండల పార్టీ అధ్యక్షుడు పట్లోరి రాజు, సీనియర్ నాయకులు రామ్ రెడ్డి, మల్లుపల్లి సర్పంచ్ ఇమ్మడి నరేష్, మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటేశం, సొసైటీ డైరెక్టర్ మల్గా నారాయణ, నాయకులు సుంకరి వెంకట్ గౌడ్, బండ రాజు, మ్యాకల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.








