పల్నాడు జిల్లా – కొప్పునూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కొప్పునూరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కొప్పునూరు మాజీ గ్రామ సర్పంచ్ కొప్పుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తే లక్ష్యంగా డాక్టర్ వైఎస్సార్ ప్రజా సంక్షేమ పాలనకు కొత్త అర్థం తీసుకొచ్చారని అన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు, 108 అత్యవసర సేవలు, 104 ఆరోగ్య సేవలు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని కొనియాడారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ సాగునీరు, రహదారులు, విద్య, వైద్య రంగాలకు వైఎస్సార్ పెద్దపీట వేశారని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా సాగించిన ఆయన పాలన ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచిందన్నారు.
వైఎస్సార్ సేవలు, ఆశయాలు నేటికీ ప్రజలకు స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఆయన భౌతికంగా దూరమైనా.. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల హృదయాల్లో ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.








