- ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా నిలిపివేత
పల్నాడు జిల్లా – మాచర్ల : మాచర్ల పట్టణం, రూరల్ ప్రాంతాల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ కీలక ప్రకటన చేసింది. గురువారం (సెప్టెంబర్ 3) మాచర్ల 132 కేవీ/33 కేవీ సబ్‌స్టేషన్‌కు వచ్చే రెంటచింతల 132 కేవీ ఫీడర్-1, ఫీడర్-2ల పరిధిలో అత్యవసర విద్యుత్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
రాయవరం జంక్షన్ సమీపంలో హైవే క్రాసింగ్ కోసం కొత్తగా 132 కేవీ విద్యుత్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసి, మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ పనుల కారణంగా 33/11 కేవీ రింగ్ రోడ్డు, రైట్ కెనాల్ సబ్‌స్టేషన్, ఏ.జే. మడక సబ్‌స్టేషన్, ద్వారకాపురి, తాళ్లపల్లి, కొప్పునూరు, ఎన్‌ఎస్ డ్యామ్, రాయవరం, గన్నవరం సబ్‌స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.
అయితే మాచర్ల పట్టణం, రూరల్ ప్రాంతాల్లోని గృహ విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. నిలిచిపోయే వ్యవసాయ విద్యుత్ సరఫరాను మరుసటి రోజు అదనంగా అందించి భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.
విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్లలో చేపట్టే ఈ పనులకు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, ప్రజలు సహకరించాలని మాచర్ల విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. నాగ సురేంద్రకుమార్ కోరారు.








