గోదావరిఖని : తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనను ఖండిస్తూ గోదావరిఖనిలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమేనని, అయితే వాటిని చర్చలు, ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా వ్యక్తం చేయాలే తప్ప దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం సరికాదని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్య విలువలను అవమానించే చర్యగా ఆమె అభివర్ణించారు.
రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేకే కాంగ్రెస్ అనుబంధ సంస్థలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిరసనలో భాగంగా గాంధీభవన్ చిత్రపటానికి నల్లరంగు వేసి నిరసన తెలిపేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ కార్యకర్తలు ఎలాంటి బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడబోరని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని కందుల సంధ్యారాణి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సులువ లక్ష్మీ నరసయ్య, మహిళా మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు చిలుక భారతి, ఎస్సీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మచ్చ విశ్వాస్, జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమయ్య, అంతర్గాం మండల అధ్యక్షుడు బోడకుంటి సుభాష్, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణతో పాటు కోడూరు రమేష్, బియ్యాల మహేందర్, కొట్టే నరేష్, అందే రాజ్ కుమార్ చారి, జక్కుల ప్రవీణ్–పద్మ, ఎల్తూరి సరిత–రాజయ్య, నడిగోట్టు రాజేందర్, హనుమాన్ల వెంకటేష్, అంకరి భరత్, మాదరబోయిన రాకేష్, పెండ్యం సత్యనారాయణ, జక్కన బాలు, మిడివెళ్లి అంజి, తిగుట్ల నవీన్, బుంగ మహేష్, అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.








