కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. అయితే బావి చుట్టూ ఏర్పాటు చేసిన సిమెంట్ రౌండ్ డివైడర్‌ను ఢీకొని బస్సు అక్కడే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సుందరగిరి గ్రామ శివారుకు చేరుకున్న సమయంలో అదుపుతప్పినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది.
అదృష్టవశాత్తూ బావి చుట్టూ ఉన్న సిమెంట్ నిర్మాణాన్ని బస్సు ఢీకొని ఆగిపోవడంతో బావిలో పడకుండా నిలిచిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ఈ ఘటనలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.








