contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హామీల మాటలు.. బాకీల మూటలు!

చిన్నకోడూరు, సిద్దిపేట జిల్లా: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజలకు బాకీలు మిగిల్చిందని ఆరోపించారు.

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు బుధవారం చిన్నకోడూరు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘బాకీ కార్డుల’ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కాముని శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్‌ ముదిరాజ్‌, సర్పంచ్‌ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు కాముని ఉమేష్‌ చంద్ర తదితరులు ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

నాలుగు ఎకరాల రైతుకు రైతుభరోసా కింద రూ.1.02 లక్షలు బాకీ ఉన్నాయని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. వరి పంటకు ఎకరాకు రూ.500 బోనస్‌ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆరు పంటలకు కలిపి ఎకరాకు రూ.75 వేల బాకీ ఉందని పేర్కొన్నారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు 33 నెలలకు రూ.82,500 బాకీ ఉందని నాయకులు పేర్కొన్నారు. వృద్ధులు, బీడీ కార్మికులకు నెలకు రూ.4 వేల పింఛన్‌, దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్‌ ఇస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు.

నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, అయితే వాటిని అమలు చేయలేదని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న హామీలు కూడా అమలుకు నోచుకోలేదన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.12 వేల కోట్లకు చేరాయని ఆరోపించిన నాయకులు.. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు, ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్న హామీలను కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. రైతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ‘బాకీ కార్డుల’ను ప్రజలకు పంపిణీ చేసినట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ శర్మ, కూర మాణిక్యరెడ్డి, కాముని శ్రీనివాస్‌, జంగిటి శ్రీనివాస్‌ ముదిరాజ్‌, కాముని ఉమేష్‌ చంద్ర, కన్నారెడ్డి, శ్రీకాంత్‌, కొలను రఘు, రాజశేఖర్‌రెడ్డి, మన్నె ఆనంద్‌, అనిల్‌, భానుచందర్‌, రాంబాబు, భాస్కర్‌, రాజయ్య, ప్రేమ్‌, రమేష్‌, టేకు తిరుపతి, చెరుకు నారాయణ, శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :