contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

1000 రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి

గోదావరిఖని : కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో వంట–వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతి నెలా మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, మహాలక్ష్మి పథకం కింద రూ.2,500, కళ్యాణలక్ష్మి పథకం ద్వారా తులం బంగారం, యువతులకు స్కూటీలు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. మహిళల సంక్షేమంపై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వాటి అమలులో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలు, పేదలు, వృద్ధులు, విద్యార్థులు, గర్భిణులు తదితర వర్గాల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు హరీష్ రెడ్డి పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించామని, ఆసరా పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు.

అలాగే కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులు, ప్రసవించిన తల్లులు, నవజాత శిశువులకు అవసరమైన సహాయం అందించామని, మహిళా స్వయం సహాయక సంఘాలకు మద్దతు కల్పిస్తూ పొదుపు, రుణాలు, ఉపాధి అవకాశాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం ఇచ్చామని వివరించారు. మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి వేధింపులపై చర్యలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.

బాలికలు, పేద విద్యార్థినులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు గురుకుల విద్యా వ్యవస్థను విస్తరించినట్లు తెలిపారు. మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా కుటుంబానికి ఆర్థిక బలంగా, సమాజంలో గౌరవంగా నిలబెట్టే విధంగా కేసీఆర్ పాలనలో పలు కార్యక్రమాలు అమలు చేశామని హరీష్ రెడ్డి పేర్కొన్నారు.

మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మూల విజయ రెడ్డి, తస్నిమ్ భాను, అనుముల కళావతి, పర్ష స్వాతి, బోడకుంట వెంకటలక్ష్మి, శాంతిలక్ష్మి, కృష్ణవేణి, రంగు దుర్గాప్రసాద్, కంకల దేవేందర్, బక్కి కిషన్, యువరాజ్ నేత, సార్ల ఉదయ్, ఎర్రవెల్లి శ్రీనివాసరావు, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :