- శోకసముద్రంలో చిగురుమామిడి..
- కుటుంబానికి అండగా నిలవాలని మంత్రి పొన్నంకు విజ్ఞప్తి
కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన బీసీ ఉద్యమ నేత, మాజీ సర్పంచ్, మాజీ జడ్పీటీసీ, ప్రస్తుత డిసిసి ఉపాధ్యక్షులు గీకూరు రవీందర్ (రవి) బుధవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మృతితో మండల వ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రజా నాయకుడు, బీసీల కోసం గళమెత్తే బలమైన గొంతుకను కోల్పోయామని నియోజకవర్గ ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు.
పోలీస్ ఉద్యోగానికి స్వస్తి.. మలి దశ తెలంగాణ ఉద్యమంలో …
సురక్షితమైన పోలీస్ ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి తెలంగాణ మలిదశ ఉద్యమంలో గీకురు రవి కీలక పాత్ర పోషించారు. గడపగడపకూ ఉద్యమ స్ఫూర్తిని నింపి మండలంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగినప్పటికీ, రాజకీయాలకు అతీతంగా బీసీ సంక్షేమం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. మండలంలోనే కాకుండా హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
కొత్త నాయకత్వానికి అండగా నిలిచిన గికురు
రాజకీయాల్లో ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలిచి అనేకమందిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలిచి ‘నేనున్నానంటూ’ ధైర్యాన్నిచ్చారు. ఆయన మరణంతో మండలంలో బీసీల గొంతుక మూగబోయిందని వివిధ బీసీ వర్గాలు, ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాతృపార్టీని కాదని పొన్నం గెలుపుకు కృషి..
గత శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి తెలంగాణ ఉద్యమ నేత పొన్నం ప్రభాకర్ పోటీ చేసిన సమయంలో, గీకురు రవిందర్ తన మాతృపార్టీని సైతం పక్కనబెట్టి ఒక ఉద్యమకారుడిగా పొన్నం విజయం కోసం అహర్నిశలూ శ్రమించారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న కుటుంబ పరిస్థితి.. ప్రభుత్వాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి
రెండు సంవత్సరాల క్రితమే భార్య మరణించడంతో గీకురు రవికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు తండ్రి కూడా అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ ఇద్దరు బిడ్డల పరిస్థితి అనాథగా మారి, కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది.మలిదశ ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచినట్లే.. తెలంగాణ స్పూర్తిని నింపిన గీకురు కుటుంబానికి కూడా ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని కరీంనగర్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ బుర్ర రాజ్ కోటి గౌడ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఒక బీసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నేతగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక శ్రద్ధ వహించి… గీకురు రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని, ఇద్దరు కుమార్తెల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నారు.








