కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్, సిర్పూర్ నియోజకవర్గ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. రాబోయే ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని, దమ్ముంటే అడ్డుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు బహిరంగ సవాల్ విసిరారు.
కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో నిర్వహించిన అత్యవసర మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో, భవిష్యత్తులో ఎవరు ఏం చేయబోతున్నారో ప్రజల సమక్షంలోనే తేల్చుకుందామని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలపై ఆగ్రహం..
కౌటాల వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ దండే విఠల్ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మాట్లాడే తీరును మార్చుకోవాలని, ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసే ముందు సంయమనం పాటించాలని సూచించారు.
22-A భూములు, ధరణిపై బీఆర్ఎస్పై విమర్శలు..
రాష్ట్రంలో 22-A నిషేధిత భూముల జాబితా, భూ వివాదాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని లోపాలు, ధరణి పోర్టల్‌లోని సమస్యలే ప్రధాన కారణమని ఎమ్మెల్సీ ఆరోపించారు.
ప్రస్తుతం సిర్పూర్ ప్రజల సమస్యలపై మాట్లాడుతున్న నాయకులు గత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అప్పట్లో ఎందుకు గొంతెత్తలేదని నిలదీశారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ప్రశ్నలు.
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించే సమయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఎందుకు అడ్డుకోలేదని కోనేరు కోనప్పను దండే విఠల్ ప్రశ్నించారు. కనీసం ప్రభుత్వానికి వినతిపత్రం కూడా ఎందుకు సమర్పించలేదని నిలదీశారు.
కోనేరు కోనప్పకు వయసుకు గౌరవం ఇచ్చామని, అయితే హద్దులు దాటి మాట్లాడితే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని ఎమ్మెల్సీ హెచ్చరించారు. ఇదే క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలని, ప్రస్తుతం ఎవరి ప్రాబల్యంలో ఉన్నారో చెప్పాలని విమర్శించారు.
ఎమ్మెల్సీ దండే విఠల్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు సిర్పూర్ నియోజకవర్గ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం ఈ వ్యాఖ్యలతో మరింత ఉత్కంఠగా మారింది.








