మాచర్ల: కె.సి.పి సంస్థల చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ వి.ఎల్. ఇందిరా దత్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక వి.ఎల్. దత్ ఆడిటోరియంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన, వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరాన్ని కె.సి.పి సీనియర్ జనరల్ మేనేజర్ వి. వెంకటరమణ, సమస్థితి మహిళా మండలి చైర్మన్ వి. సుశీల, రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల అధ్యక్షుడు పఠాన్ నాగూర్ వలి, కె.సి.పి హెచ్‌ఆర్ ప్రతినిధి ఉదయ్ కుమార్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు ప్రారంభించారు.
శిబిరానికి హాజరైన పురుషులు, మహిళలకు ప్రముఖ వైద్యులు, వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఛాతీ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, పాప్ స్మియర్, మెమోగ్రఫీ తదితర పరీక్షలను అందించారు. మొత్తం 230 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించగా, పరీక్షల్లో సుమారు 8 మందిలో క్యాన్సర్‌కు సంబంధించిన అనుమానాస్పద లక్షణాలను వైద్యులు గుర్తించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అదేవిధంగా శిబిరానికి వచ్చిన వారికి క్యాన్సర్ వ్యాధి, దాని లక్షణాలు, ముందస్తు గుర్తింపు, చికిత్స ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే మెరుగైన చికిత్సా ఫలితాలు సాధించవచ్చని వైద్య నిపుణులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ మూడవత్ దశరథ్ చౌహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు.
కార్యక్రమం అనంతరం శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన వైద్యులు, టెక్నికల్ సిబ్బందిని కె.సి.పి సిమెంట్ యూనిట్-1, రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల, సమస్థితి మహిళా మండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.








