contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కండక్టర్ లేడని బస్సు గంటన్నర లేట్ .. ప్రయాణికుల అవస్థలు!

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: ప్రజా రవాణాలో సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటన గన్నేరువరంలో చోటుచేసుకుంది. కరీంనగర్ డిపోకు చెందిన కరీంనగర్–పొత్తూర్–గన్నేరువరం (మైలారం) బస్సు సోమవారం ఉదయం 10:45 గంటలకు రావాల్సి ఉండగా, సుమారు గంటన్నర ఆలస్యంగా మధ్యాహ్నం 12 గంటలకు గన్నేరువరం చేరుకుంది.

ఎండలో గంటల తరబడి నిరీక్షణ

బస్సు నిర్ణీత సమయానికి రాకపోవడంతో బస్టాండ్‌లో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతూ చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు బస్సు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఎక్కేందుకు ప్రయత్నించడంతో బస్సు కిక్కిరిసిపోయింది.

బస్సు ఆలస్యానికి కారణం ఏమిటని డ్రైవర్‌ను ప్రయాణికులు ప్రశ్నించగా, కండక్టర్ అందుబాటులో లేకపోవడంతో బస్సు ఆలస్యమైందని సమాధానం ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.

కండక్టర్ అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయకుండా బస్సును ఆలస్యంగా నడపడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు.

సమయపాలన పాటించాలని డిమాండ్

గ్రామీణ ప్రాంతాలకు నడిచే ఆర్టీసీ బస్సులు నిర్ణీత సమయానికి నడిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. సిబ్బంది కొరత లేదా ఇతర కారణాలతో బస్సు సేవలకు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, గ్రామీణ బస్సుల సమయపాలన, సిబ్బంది అందుబాటు, ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :