- బుగ్గారం ఎస్సై మీద హెచ్.ఆర్.సి. లో పిర్యాదు
- నాయకులకు వంతపాడుతూ మండల ప్రజలకు అన్యాయం
- న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించే దారిలో ఎస్సై తీగల అశోక్ :
- మానవహక్కుల కమీషన్ ఎదుట ఆరోపించిన జనసమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి
బుగ్గారం- జగిత్యాల జిల్లా:నాయకులకు వంతపాడుతూ మండల ప్రజలకు అన్యాయం చేస్తూ, ఏకంగా న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించే దారిలో ఎస్సై తీగల అశోక్ ప్రయత్నిస్తున్నాడని జనసమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి మానవహక్కుల కమీషన్ కు పిర్యాదు చేశారు. గురువారం ఆయన బుగ్గారం హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
గత మే నెల 1న సాక్షాత్తు పోలీస్ స్టేషన్ గేటుముందే తనపై జరిగిన హత్యాయత్నం దాడి కేసులో ప్రస్తుత ఎస్సై తీగల అశోక్ నాయకుల, ప్రజాప్రతినిధుల పేర్లు తొలగించి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని మానవహక్కుల కమీషన్ కు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నట్లు వెల్లడించారు. అలాగే గత జూన్ 28న డివిజనల్ పంచాయతీ అధికారిణి కనకదుర్గ బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగం విషయంలో జరిపిన విచారణ సమయంలో సర్పంచ్ అనుచరులు, పాలకవర్గం సభ్యులు హంగామా సృష్టించి దాడులు చేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ విషయంలో ఫిర్యాదులు చేసినా ఎస్సై కేసు నమోదు చేయలేదన్నారు. జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసినా చర్యలు శూన్యం కావడంతో మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడైన ఒక వ్యక్తి తనపై పెట్టిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పై, దొంగ సాక్షులపై కూడా పునర్విచారణ జరిపించి కేసును కొట్టివేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మానవ హక్కుల కమీషన్ ను చుక్క గంగారెడ్డి కోరినట్లు వివరించారు. బుగ్గారం లో జరుగుతున్న పలు అసాంఘిక, నాయకుల కార్యకలాపాలపై కూడా మానవ హక్కుల కమీషన్ ఎదుట పిర్యాదు చేసినట్లు ఆయన సూచించారు.