- స. హ. చట్టాన్ని ఉల్లంఘించిన జిల్లా కలెక్టరేట్
- 17 దరఖాస్తులకు సమాధానం ఇవ్వని అధికారులు
- రాష్ట్ర సమాచార కమీషన్ కు అప్పీల్ చేసిన చుక్క గంగారెడ్డి
జగిత్యాల: జగిత్యాల జిల్లా కలెక్టరేట్ అధికారులు సమాచార హక్కు చట్టం – 2005 ను ఉల్లంఘించారని
సీనియర్ ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ కు ఆయన అప్పీల్ చేశారు. ప్రజల చేతిలో వజ్రాయుధం అయిన స.హ. చట్టంను పటిష్టంగా అమలు పర్చాల్సిన జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులే చట్టాన్ని ఉల్లంఘించడం బాధాకరం అన్నారు. ఆర్టీఐ ద్వారా తాను చేసిన 17 దరఖాస్తులకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. 30 రోజుల లోపు ఇవ్వాల్సిన సమాచారాన్ని కొన్ని నెలలు గడిచినా ఇవ్వకుండా మొదటి అప్పీల్ చేసినా పట్టించుకోకుండా ఉన్నతాధికారులే స.హ. చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీఐ కార్యకర్తలకు రక్షణ కూడా కరువయ్యిందని, అందుకే అవినీతి – అక్రమాలు, నిధుల దుర్వినియోగం పెరిగిపోతోందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, కమీషన్లు, ప్రభుత్వాలు స్పందించి చట్టాల అమలులో ప్రత్యేక శ్రద్ధ వహించి కఠిన చర్యలు తీసుకోవాలని చుక్క గంగారెడ్డి కోరారు.










