కోరువాడ జగన్నాధపురం: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని కే.కోటపాడు మండలం కోరువాడ జగన్నాధపురం రెవెన్యూ పరిధిలో రీ సర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రైతుల కథనం ప్రకారం, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. కేజీపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 189/1 నుంచి 189/20 వరకు డి-పట్టాలు పొందిన రైతులు ప్రస్తుతం మామిడి తోటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు.
అయితే, ఇటీవల నిర్వహించిన రీ సర్వేలో తమ భూముల వివరాలు వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో నమోదు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బ్యాంకు రుణాలు, రైతు భరోసా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించి, తమ భూములను వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో నమోదు చేసి పట్టాదార్ పాస్‌పుస్తకాలు తిరిగి అందజేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో) జ్యోతి, సచివాలయ సర్వేయర్ సంతోష్ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. సర్వే నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి, తదుపరి చర్యలు చేపట్టేందుకు పంపనున్నట్లు వారు రైతులకు వెల్లడించారు.








