contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జెడ్‌ జోగంపేటలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి

అనకాపల్లి : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని రావికతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో ఉన్న జెడ్‌ జోగంపేట గ్రామాన్ని కేంద్రంగా కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గతంలో 2026 ఫిబ్రవరి 21న రావికతం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించినప్పటికీ, అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల చోడవరం నియోజకవర్గంలో 29 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ, అందులో జెడ్‌ జోగంపేట గ్రామానికి పోలింగ్ కేంద్రం లేకపోవడం తీవ్ర అన్యాయమని నాయకులు విమర్శించారు.

ప్రస్తుతం జెడ్‌ జోగంపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే సుమారు 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న చీమలపాడు పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, గిరిజన ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొండ ప్రాంతాల్లో గుర్రాలపై లేదా డోలీల సాయంతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.

జెడ్‌ జోగంపేటలో ప్రభుత్వ ఎంపీపీ పాఠశాల, సెల్‌ఫోన్ సిగ్నల్, రహదారి సౌకర్యం వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా బంగారుబందలు, జీలుగున్నవ, కడగడ్డ, అజయ్‌పురం, జెడ్‌ జోగంపేట, నేరేడు బంధ, గంగంపేట, రెచ్చిపనుకులు, తాటిపర్తి, పెద్దగరువు, రాయపాడు తదితర గ్రామాలకు చెందిన సుమారు 600 మంది ఓటర్లు ఈ ప్రాంతంలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ గ్రామాలన్నీ జెడ్‌ జోగంపేటకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో అక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు.

ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రం ఓటర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సి ఉండగా, 10 కిలోమీటర్ల దూరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నాయకులు విమర్శించారు.

జెడ్‌ జోగంపేటలో తక్షణమే ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, లేకపోతే జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు, వంతల ప్రభుదాస్, గేమిల వాసు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :