రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. 2025 -26 మార్కెటింగ్ సీజన్ కోసం 14 కీలక ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా క్వింటాల్ వరి మద్దతు ధరను రూ.69 మేర పెంచింది. తాజా పెంపుతో క్వింటాల్ వరి మద్దతు ధర రూ.2,369కి చేరింది.
రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధరించుకోవడానికి, కొత్త పంటలు వేయడానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఏటా ఖరీఫ్ పంటల ఎంఎస్పీని సవరిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా నైజర్ సీట్ (క్వింటాల్‌కు రూ.820), రాగి (క్వింటాకు రూ.596), పత్తి (క్వింటాకు రూ.589), నువ్వులు (క్వింటాకు రూ.579) చొప్పున నిర్ణయించింది.
పప్పు ధాన్యాలు కందిపప్పు ధరను రూ.450కు, పెసరపప్పు ధరను రూ.86కు, మినపప్పు ధరను రూ.400కు పెంచింది.
ఇక నూనె గింజల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విషయానికి వస్తే, వేరుశెనగ (రూ.480), పొద్దుతిరుగుడు (రూ.441), సోయాబీన్ (రూ.436) చొప్పున పెంచారు. పత్తి కనీస మద్దతు ధర రూ.589కి పెరిగింది.
2018-19 కేంద్ర బడ్జెట్లో అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయం కంటే, కనీసం 1.5 రెట్లు కనీస మద్దతు ధర ఉండేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈ 2025-56 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచింది కేంద్ర కేబినెట్.
రైతులకు వారి ఉత్పత్తి వ్యయం కంటే, ఎక్కువ మార్జిన్ ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సజ్జ (63 శాతం), మొక్కజొన్న (59 శాతం), కంది (59 శాతం), మినపప్పు (53 శాతం) మార్జిన్ ఉంటుందని అంచనా. మిగిలిన పంటలకు కనీస ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం ఎక్కువ మార్జిన్ ఉంటుందని అంచనా.
“ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పోషక తృణధాన్యాలను కాకుండా ఇతర పంటల సాగును బాగా ప్రోత్సహిస్తోంది. ఆ పంటలకు అధిక ఎంఎస్పీని అందిస్తోంది” అని కేంద్రం తెలిపింది.
వడ్డీ రాయితీ కూడా ..
కేంద్ర కేబినెట్ రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు కేటాయించింది.
రోడ్లకు నిధులు కేటాయింపు
బద్వేలు-నెల్లూరు 4 వరుసల రోడ్డుకు రూ.3,653 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే రత్లాం-నగడ రైల్వే మార్గాన్ని 4 వరుసలుగా మార్చేందుకు, వార్దా-బల్లార్షా రైల్వే మార్గాన్ని 4 వరుసలుగా మార్పు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది.