ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఆయన భార్య బ్రిగెట్ మెక్రాన్‌కు సంబంధించిన ఓ వైరల్ ఘటన మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత ఏడాది వియత్నాం పర్యటన సందర్భంగా విమానం దిగుతుండగా బ్రిగెట్, మెక్రాన్ ముఖాన్ని తోసేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజాగా విడుదలైన ఓ పుస్తకం ఆ ఘటన వెనుక ఉన్న కారణాలపై సంచలన ఆరోపణలు చేసింది.
ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఫ్లోరియన్ టార్డిఫ్ రచించిన ‘యాన్ (ఆల్మోస్ట్) పర్ఫెక్ట్ కపుల్’ పుస్తకంలో, ఇరాన్‌కు చెందిన నటి గోల్షిఫ్తే ఫరహానీతో మెక్రాన్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలే ఈ వివాదానికి కారణమని పేర్కొన్నారు. పుస్తకం ప్రకారం, వియత్నాం పర్యటనలో భాగంగా విమానం దిగే ముందు మెక్రాన్ ఫోన్‌లో ఫరహానీ పంపిన కొన్ని వ్యక్తిగత సందేశాలను బ్రిగెట్ చూశారని, దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురై అందరి ముందే భర్త ముఖాన్ని పక్కకు తోసేశారని ఆరోపించారు.
మెక్రాన్ మరియు ఫరహానీ మధ్య కొన్ని నెలలుగా స్నేహపూర్వక సంబంధం కొనసాగుతోందని, అయితే వారి మధ్య జరిగిన కొన్ని సంభాషణలు హద్దులు దాటాయని రచయిత టార్డిఫ్ ఓ రేడియో ఇంటర్వ్యూలో వెల్లడించారు. “నువ్వు చాలా ఆకర్షణీయంగా ఉన్నావు”, “నువ్వు చాలా అందంగా ఉన్నావు” వంటి సందేశాలు ఒకరికొకరు పంపుకున్నారని, ఆ వివరాలు తనకు మెక్రాన్ సన్నిహితుల ద్వారానే అందాయని పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలను బ్రిగెట్ మెక్రాన్ బృందం తీవ్రంగా ఖండించింది. ఆ రోజు జరిగిన సంఘటన సరదాగా జరిగినదేనని, పుస్తకంలోని విషయాలు పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేసింది. గతంలో ఈ ఘటనను “ఫేక్ న్యూస్”గా కొట్టిపారేసిన ఫ్రాన్స్ అధ్యక్ష భవనం, తాజా ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, తనపై గతంలో వచ్చిన వదంతులను నటి ఫరహానీ కూడా ఖండించిన విషయం తెలిసిందే.
‘ఫ్రెంచ్ స్లాప్‌గేట్’గా సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందిన ఈ ఘటన, ఇప్పుడు కొత్త పుస్తకం కారణంగా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.








