contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జర్నలిజం ముసుగులో బెదిరింపులు .. ‘యూట్యూబ్’ జర్నలిస్టుల అరెస్ట్

ఆసిఫాబాద్ : జర్నలిజం ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు సోషల్ మీడియా జర్నలిస్టులను ఆసిఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి (DAO) బోర్కుట్ వెంకటిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో నివాసముంటున్న బుతే దేవేందర్, డుప్త సురేష్ కలిసి పథకం రూపొందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దేవేందర్ దహేగావ్ మండలానికి చెందిన ‘మెదక్ టుడే’ జర్నలిస్టుగా, సురేష్ చింతలమానేపల్లి మండలానికి చెందిన ‘సూరన్న టీవీ’ జర్నలిస్టుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రాధిక ట్రేడర్స్ యజమానితో ఉన్న వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో ఆ దుకాణాన్ని మూసివేయించేందుకు దేవేందర్ వ్యవసాయ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల కథనం. అయితే అధికారులు నిర్వహించిన విచారణలో సంబంధిత దుకాణానికి లైసెన్సులు, రికార్డులు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు.

దీంతో అధికారులపై అసంతృప్తి పెంచుకున్న దేవేందర్.. సురేష్‌తో కలిసి డీఏఓ వెంకటిని ఫోన్ కాల్స్, వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అధికారిపై ఒత్తిడి తెచ్చి మొదట రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపారు.

పోలీసుల ప్రకారం.. జూలై 26న బాధితుడి నుంచి రూ.1.30 లక్షల నగదును నిందితులు తీసుకున్నట్లు కేసులో ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు ఆగస్టు 5న ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఆసిఫాబాద్ సీఐ ఎన్. రవి ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం ఆగస్టు 7న హైదరాబాద్‌లో నిందితులను అదుపులోకి తీసుకుని ఆసిఫాబాద్‌కు తరలించింది. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టయిన నిందితుల్లో A-2గా ఉన్న డుప్త సురేష్‌పై గతంలో కాగజ్‌నగర్ సబ్‌డివిజన్ పరిధిలో మైనర్ బాలికకు సంబంధించిన వివరాలు, వీడియోలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన ఆరోపణలపై పోక్సో చట్టం కింద కేసు నమోదై విచారణ కొనసాగుతోందని డీఎస్పీ బి. అశోక్ తెలిపారు.

ప్రస్తుత కేసు దర్యాప్తులో భాగంగా వాట్సాప్ చాట్‌లు, సోషల్ మీడియా పోస్టులు, ఆర్థిక లావాదేవీలు, కాల్ డేటా తదితర ఆధారాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని, నేరం రుజువయ్యేలా ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని డీఎస్పీ స్పష్టం చేశారు.

జర్నలిజం పేరుతో బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :